హైదరాబాద్/నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 3: సీఎం కేసీఆర్ రుణ మాఫీని ప్రకటించడంపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఆయన చాంబర్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రుణ మాఫీతో రైతుల సంబురాలు అంబరాన్నంటాయి. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అంటూ రైతులు కీర్తిస్తున్నారు. రుణమాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకొన్నారు. ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, అన్నదాతల కోసం ఏదైనా చేస్తారని, మాట ఇచ్చారంటే.. తప్పకుండా అమలు చేస్తారంటూ రైతులు కితాబిచ్చారు. కేసీఆర్ రుణమాఫీ ప్రకటన చేసి ప్రతిపక్షాలు నోరు తెరువకుంట చేశారని పలువురు రైతులు వ్యాఖ్యానించారు. పలు జిల్లాల్లో పటాకులు కాలుస్తూ స్వీట్లు పంచిపెట్టారు. పంట పొలాల్లోనూ కేసీఆర్ చిత్రపటాలతోపాటు.. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. క్యాబినెట్ నిర్ణయాలపై రైతులు, ప్రజల పక్షాన సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
నాందేడ్‌లోనూ సంబురాలు..
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నయాగాం నియోజక వర్గంలోని బాబ్లీ గ్రామంలోనూ రుణమాఫీ సంబురాలు నిర్వహించారు. బాబ్లీ సర్పంచ్ బాబురావు కదమ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పటాకులు కాల్చారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టారు. ‘అబ్కీ బార్ కేసీఆర్ సర్కార్.. జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.