ములుగు : మేడారం(Medaram) జాతరలో పూజారులు పాత్ర కీలకంగా ఉంటుందని, పూజారుల కోసం నూతనంగా ప్రత్యేక అతిథి గృహాన్ని నిర్మిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surek) అన్నారు. జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో పూజారులు అతిథి గృహం సముదాయ నిర్మాణా పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటి సారిగా ఆమె మేడారంలోని వన దేవతలను సందర్శించుకున్నారు. 1.5 కోట్లు రూపాయలతో మేడారం పూజారుల కోసం నూతనంగా నిర్మించే ప్రత్యేక అతిథి గృహ సముదాయ పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మేడారం గిరిజన జాతరలో పూజారులు పాత్ర కీలకంగా ఉంటుం దన్నారు. వారి కోసం ప్రభుత్యం ప్రత్యేకంగా అతిథి గృహ నిర్మాణం చేపడుతుందన్నారు. వచ్చే జాతర సమయానికి ఈ అతిథి గృహం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో రాజీ పడొద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.