Viprahitha Brahmin Sadan | సూర్యాపేట, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సాంస్కృతిక, సామాజిక, వైదికపరమైన కార్యక్రమాలతోపాటు బ్రాహ్మణ సమాజ హిత కార్యకలాపాల కోసం సకల సౌకర్యాలతో విప్రహిత బ్రాహ్మణ సదనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్‌పల్లిలో రూ.2.50 కోట్లతో రెండంతస్తుల్లో బ్రాహ్మణ సదన్ నిర్మాణం చేపట్టారు. కింది అంతస్తు పనులు పూర్తి కాగా.. ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు.
ఇప్పటికే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ.12 కోట్లతో నిర్మించిన రాష్ట్ర స్థాయి విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. సిద్దిపేట, చేరాలలో బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి రూ.75 లక్షలు, మధిరలో రూ.73 లక్షలు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధి కోసం రిటైర్డ్ ఐఏఎస్ కేవీ రమణాచారి అధ్యక్షతన 18 మంది సభ్యులతో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. పరిషత్ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.261 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో గరిష్ఠంగా 75 శాతం బ్రాహ్మణ పరిషత్ భరిస్తున్నది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్‌పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను సకల సౌకర్యాలతో ప్రభుత్వం నిర్మించింది.
సీఎం కేసీఆర్‌కు అన్నీ శుభాలే కలగాలి
హైదరాబాద్‌లో మొదటి బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభించుకొని నేడు సూర్యాపేటలో రెండోది ప్రారంభించుకోవడం బ్రాహ్మణులందరికీ గర్వకారణం. జాతీయ రహదారిపై అందరికీ అందుబాటులో ఉండేలా భూమిని దానం చేసిన డాక్టర్ రామయ్య దంపతులకు, భవనం నిర్మాణం చేయించిన సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి అన్నీ శుభాలే కలుగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం.
Hall