హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24(నమస్తే తెలంగాణ) : ఒకసారి అక్కడ పోస్టింగ్ తీసుకుంటే చాలు.. ఇక అక్కడినుంచి మరోచోటుకు బదిలీపై వెళ్లరు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి విరమణ పొందే దాకా అక్కడే తిష్ట వేస్తారు. ఇలా హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే దవాఖానలో మినిస్టీరియల్ స్టాఫ్ ఒకరు అక్షరాల 40 ఏండ్లు.. మరొకరు 20 ఏండ్ల పాటు పాతుకుపోవడమే గాక స్వయంప్రతిపత్తి ముసుగులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా, స్వలాభం కోసం అవినీతి, అక్రమాలతో దవాఖానను అస్తవ్యస్తం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగోన్నతి వస్తే తాము డీహెచ్ పరిధిలోని ఉద్యోగులమని ప్రమోషన్లు తీసుకోవడం, అదే డీహెచ్ పరిధిలోనే బదిలీ జరిగితే మాత్రం తాము డీహెచ్ పరిధిలోకి రామని, బదిలీ ఉత్తర్వులు వర్తించవంటూ తప్పించుకుంటున్నారు. అంతేగాక ఎక్కడా లేని విధంగా నిత్యం 2వేల నుంచి 3వేల మంది రోగులు వచ్చే ఉస్మానియా, గాంధీ దవాఖానలకు ఒక ఏవో(అడ్మినిస్టేషన్ ఆఫీసర్) పోస్టు మాత్రమే ఉంటే ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానకు మాత్రం ఐదు ఏవో పోస్టులను మంజూరు చేసిన ఘనత పాత డైరెక్టర్‌ది. ఎంఎన్జేలో 1985లో చేరిన ఓ అధికారి వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉద్యోగోన్నతులు పొంది ప్రస్తుతం ఏవోగా విధులు నిర్వర్తిస్తూ, రేపో మాపో రిటైర్మెంట్ కానున్నారు.
సదరు అధికారి 40 ఏండ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. మరో అధికారి కారుణ్య నియామకం కింద 2005లో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి 2018లో అక్కడే సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందారు. 2023లో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వ దంత వైద్యశాలలో ప్రమోషన్ దక్కినా, సదరు అధికారి ఎంఎన్‌జేను వదిలి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ప్రస్తుతం అదే దవాఖానలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2009లో చేరిన మరొకరు జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొంది అక్కడే తిష్ట వేశారు.
ఎంఎన్జేలో పెరుగుతున్న రోగుల సంఖ్య, విస్తరిస్తున్న దవాఖాన భవనాలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్టుగా వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్స్ వంటి అత్యవసరమైన పోస్టులు క్రియేట్ చేయాల్సి ఉండగా, నాటి డైరెక్టర్ అందుకు భిన్నంగా కేవలం బిల్లులు, నిధులు, కమీషన్లు తదితర వ్యవహారాలు చక్కబెట్టే పోస్టులపైనే దృష్టిపెట్టినట్టు ఎంఎన్‌జే వర్గాలు మండిపడుతున్నాయి. ఏవో పోస్టుల విషయంలోనూ అప్పటి డైరెక్టర్ 2022లో స్వలాభం కోసం నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా మూడు పోస్టులు సృష్టించారని ఆరోపిస్తున్నారు.
గతంలో ఇక్కడ కూడా ఒకటే ఏవో పోస్టు ఉండగా 2017లో 2వ పోస్టు మంజూరు చేశారు. కేవలం 750 పడకల సామర్థ్యం, సింగిల్ స్పెషాలిటీ గల ఎంఎన్జేలో మాత్రం ఐదు ఏవో పోస్టులు ఉండడం గమనార్హం. అంతేగాక ఆయా విభాగాల పరిధిలో దీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అధికారుల పూర్తి వివరాలు పంపాలని ఈ నెల 3న వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రంలోని అన్ని దవాఖానలు, మెడికల్ కాలేజీలు, ఇతర విభాగాలకు ఆదేశాలు జారీచేసింది. కానీ 10రోజులు గడిచిపోయినా కనీసం సంబంధిత జాబితాను రూపొందించేందుకు ఎంఎన్‌జే పాలకవర్గం యత్నించకపోవడం గమనార్హం.
ఎంఎన్జేలో రెండు రకాల ఉద్యోగులు ఉన్నారు. గతంలో పనిచేసిన కొందరు డైరెక్టర్లు వారి స్వలాభాల కోసం స్వయంప్రతిపత్తి ముసుగును అడ్డుపెట్టుకొని లక్షల్లో లంచాలు తీసుకుని ఉద్యోగులను నియమించుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా కొందరు ఉద్యోగులు సైతం ఉన్నతాధికారులను బురిడీ కొట్టిస్తూ సంవత్సరాల తరబడి పాతుకుపోయారు. ఈ క్రమంలోనే కొందరు మినిస్టీరియల్, ఇతర విభాగాల్లోని సిబ్బంది ఇతర ప్రాంతాలకు బదిలీ కాకుండా తప్పించుకుంటున్నారు.
వాస్తవానికి మినిస్టీరియల్ సిబ్బందైన జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏవో) డీహెచ్(డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్)పరిధిలో నియామకమయ్యారు. వీరికి సంబంధించిన బదిలీలు, ఉద్యోగోన్నతులు, ఇతర అంశాలన్నీ డీహెచ్ పరిధిలోనే ఉంటాయి. అయితే ఉద్యోగోన్నతులు కల్పించినప్పుడు ప్రమోషన్లు కొట్టేయడం, అదే బదిలీలు జరిగితే మాత్రం తప్పించుకోవడం గమనార్హం.