Adluri Laxman | కంఠేశ్వర్, అక్టోబర్ 12 : ‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నన్ను టార్గెట్ చేసిండు. కావాలనే నాపై విమర్శలు చేస్తున్నడు’ అని కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్లో నిర్వహించిన వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలు, మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పని చేస్తున్న తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రెచ్చగొట్టి విమర్శలు చేస్తున్నారని, ఆయన తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదని అన్నారు. మంత్రి లక్ష్మణ్ వస్తే తాను వెళ్లిపోతున్నాననడం అబద్ధమని పేర్కొన్నారు. తనది మాల జాతి అయినందున మంత్రి లక్ష్మణ్ విమర్శిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో ఆయన్ను ప్రోత్సహించింది మా నాన్నే అని తెలిపారు.
హైదరాబాద్లో జరిగిన మాలల గర్జనతో మాలల్లో ఐక్యత పెరిగిందని, దేశంలో ఒక సామాజిక వర్గానికి చెందిన సభ అంతా పెద్దగా నిర్వహించడం అదే మొదటిసారి అని పేర్కొన్నారు. మాలల కోసం పోరాటం చేస్తుంటే కొందరు కుట్రలు చేసి సోషల్ మీడియా వేదికగా తనను అవమానపర్చేందుకు ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ రిజర్వేషన్ 15 నుంచి 18 శాతం పెంచాలని తీర్మానం చేసినప్పటికీ అమలు కాలేదని, రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం జరిగిందని తెలిపారు. పోరాడితేనే ఫలితాలు వస్తాయని, దేశంలో ఇంకా కులవివక్ష మిగిలి ఉన్నదని, మాల ఉద్యోగులకు వేధింపులు తప్పడం లేదని విచారం వ్యక్తంచేశారు. ఒక వర్గం మీడియా కావాలనే తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు. తాను నిజాయితీగా ఉన్నానని, నిజాయితీగా వ్యాపారాలు చేస్తున్నానని తెలిపారు. మాలలంతా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు.