నిజామాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేకచోట్ల చెరువు కట్టలు తెగి రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తున్న దృష్ట్యా మరో రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మేలని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రహదారుల పై నుంచి నీరు ప్రవహిస్తున్న ప్రదేశాల్లో ఎంతమాత్రం రోడ్డును దాటే ప్రయత్నం చేయవద్దని జాగ్రత్తలు సూచించారు.
మూడోరోజు కూడా మంత్రి జిల్లాలోని పలు మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో భారీ వర్షాలు కురవడంతో నవాబ్ చెరువు, ఇతర చెరువులు తెగడంతో గ్రామానికి వెళ్లే రహదారులు, బ్రిడ్జిలు కోతకు గురవ్వగా మంత్రి పరిశీలించారు.
అలాగే పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ పరిశీలనకు వెళ్తూ మార్గ మధ్యలో బాల్కొండ మండల కేంద్రంలో నాయకులు, ప్రజల్ని కలిసి మండలంలో కురిసిన భారీ వర్షాలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నాయకులు సహాయ సహకారాలు అందించాలని, బియ్యం కూరగాయలు అందించాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో వన్నెల్ బి, బోదెపల్లి, బాల్కొండ మండల ప్రజలను, నాయకులను కలుస్తూ గ్రామ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెండోరా మండలం కోడిచెర్ల , సావేల్ గ్రామాల మధ్య రహదారి పై నుంచి నిన్నటి వరకు ఉధృతంగా నీరు పారడంతో ఈ రోజు స్థానిక నాయకులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ కు వరద ఎక్కువగా వస్తుండటంతో సుమారు 30 గేట్ల ద్వారా లక్ష 80వేల క్యూసెక్కుల నీరు గోదావరి లోకి వదులుతుండటంతో అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నది సమీపానికి వెళ్లే సాహసం చేయవద్దని, అనవసర ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ మేరకు ప్రజలెవరూ గోదావరి నది పరిసరాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మెండోరా, ఏర్గట్ల మండలాల రెవెన్యూ, పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.
గత నలభై, యాభై సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రులు కూడా ఎస్సారెస్పీని పట్టించుకోలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారి ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతుల కోసం రూ. 22 కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. ఒకేసారి అన్ని గేట్ల మరమ్మతులు చేపట్టడం సాధ్యపడనందున విడతల వారీగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మరో ఆరు గేట్లకు మరమ్మతులు పూర్తి కావాల్సి ఉందని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.
వరద తాకిడికి గురైన వారిని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామని, బీ ఆర్ ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునేందుకు చొరవ చూపాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.