వేల్పూర్: రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చిట్టాపూర్, ఫతేపూర్, సుబ్బిర్యాల్ లిఫ్ట్ డిజైన్లపై గురువారం ఆయన జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ. 149.66 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన చిట్టాపూర్, ఫతేపూర్, సుబ్బిర్యాల్ లిఫ్ట్ డిజైన్ ప్లాన్లను మంత్రి పరిశీలించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో కనీస నీటిమట్టం ఉన్న సమయంలో కూడా పంపింగ్ చేసే విధంగా ప్లాన్లు, డిజైన్లు రూపొందించాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు.
లిఫ్ట్ నుంచి సుబ్బిర్యాల్, ఫతేపూర్, చిట్టపూర్ ఆయకట్టు గ్రామాలకు విడివిడిగా పైపులైన్లు, డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ ఉండేలా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. వివిధ గ్రామాల మధ్య సాగు నీరందించే సమయంలో తగాదాలు లాంటివి ఉత్పన్నం కాకుండా వేర్వేరుగా పైపు లైన్లు, కాలువల నిర్మాణాలు చేపట్టాలని అదేశించారు. ఆయకట్టు రైతుల ప్రయోజనాల దష్ట్యా ప్రాజెక్ట్ లో 1020 మీ.నీటి మట్టం ఉండగా, నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్లు చేయాలన్నారు. దీనితో 6.00 టీఎంసీల నిలువ నుంచి నీటిని పంపు చేసేలా ఉండాలన్నారు. ఈ లిఫ్ట్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, చిట్టాపూర్,శ్రీరాంపూర్ గ్రామాలకు చెందిన సుమారు 3,500 ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్ఈ యశశ్వీ, ఈఈలు భానుప్రకాశ్, వెంకటరమణ, డీఈ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.