భీమ్‌గల్, జూన్ 14: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచనే ఫారెస్ట్ అర్బన్ పార్క్‌ల ఏర్పాటని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లోని లింబాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ సమీపంలో ఫారెస్ట్ అర్బన్ పార్క్ కోసం మంత్రి స్థల పరిశీలన చేశారు. అటవీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఏర్పాటుతో పట్టణ సమీపంలోని వారికే కాకుండా సమీప గ్రామాల ప్రజలకూ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
ఇందులో ఐదు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్కు, ఓపెన్ జిమ్, లైటింగ్, వాష్‌రూమ్స్, వాచ్ టవర్లు ఏర్పాటు చేసేలా రూ.6 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. త్వరలో ప్రతిపాదనలపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో హైదరాబాద్‌లో సమావేశమై చర్చిస్తానని చెప్పారు. ఫారెస్ట్ అర్బన్ పార్క్‌తోపాటు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలోని అడవిని ఆధునిక పద్ధతిలో పెంపొందించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా నుంచి రుద్రంగి వయా మానాల వరకు రూ.14.30 కోట్ల వ్యయంతో చేపట్టిన డబుల్ రోడ్డు పనులను మంత్రి వేముల పరిశీలించారు. పూర్తి నాణ్యతతో పనులు జరగాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
వేల్పూర్, జూన్ 14 : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి మరో ఏడు చెక్‌డ్యాములు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వేల్పూర్‌లో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నియోజకవర్గంలోని పెద్దవాగు మీద 4, కప్పలవాగు మీద 3 చెక్‌డ్యాముల నిర్మాణానికి సుమారు రూ.57.08 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.