హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయం పనులను నిర్ణీత సమయం లోపు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం ఢిల్లీ వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. భవన ప్రాంగణం, నిర్మాణ ప్రాంతం అంతా కలియదిరిగారు. అనంతరం ఆరిటెక్ట్, వర్ ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా భవన నిర్మాణం పూర్తి కావాలని, ఎలివేషన్ సంబంధించిన జీఆర్సీ పనులు వేగంగా చేపట్టాలని సూచించారు. మంత్రి వేముల వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఆరిటెక్ట్ ఆసార్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.