నిజామాబాద్ : ప్రజలకు మంచి చేయాలనే తపన ఉండాలని, మతాల మధ్య చిచ్చుపెట్టడం కాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ అరవింద్‌కు సూచించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పార్టీలు,రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని అన్నారు.
‘ పసుపు బోర్డు తీసుకువస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి , రైతులను మోసం చేసిన ఘనత అరవింద్‌కే దక్కుతుందని’ దుయ్యబట్టారు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఇప్పించినట్లుగానే అర్వింద్ కూడా ప్రధాని నుంచి పీఎంఆర్ఎఫ్ ఇప్పించాలని అడిగితే వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కు సైకిల్ మోటార్ ఉన్న కుటుంబం అర్హులు కారని కేంద్రం సవాలక్ష ఆంక్షలు పెట్టిందని విమర్శించారు. ఈ రోజుల్లో సైకిల్ మోటార్ లేని ఇల్లు ఉన్నదా అని ప్రశ్నించారు.
ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ ఎన్నోరెట్టు మెరుగైందని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 10 వేల మందికి రూ. 40 కోట్లు ఇప్పించానని సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పించానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అరవింద్‌ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు మరోసారి అలాంటి పొరపాటు చేయరని వెల్లడించారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.