హైదరాబాద్, జనవరి11 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునరుద్ధరణపై సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సమీక్షించారు. సచివాలయంలో లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, ఇరిగేషన్‌శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇతర అధికారులతో కలిసి పనులపై చర్చించారు. నిరుడు ఫిబ్రవరి 22న సొరంగం కూలిపోవడంతో పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీబీఎం(టన్నెల్ బోరింగ్ మిషన్)పద్ధతిలో సొరంగం తవ్వడం అసాధ్యమని, డీబీఎం(డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్) పద్ధతిలో పనులు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ పనులు చేపట్టేందుకు ఇటీవలే ఎన్జీఆర్ఐ(నేషనల్ జియాలాజిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో ఎలక్ట్రో మాగ్నెట్ సర్వేను పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. త్వరితగతిన పనులను ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్ల బాధ్యతలను ‘ఆఫ్రీ’ సంస్థకే అప్పగించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఏజెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ)ని ఆహ్వానించగా.. ఆఫ్రీ, ఆర్వీ అసోసియేట్స్, డీఎంఆర్ సహా ఐదు కంపెనీలు ముందుకు వచ్చాయి. అందులో 3 సంస్థల నుంచి ప్రైస్బిడ్ల కోసం రిక్వెస్ట్ పంపారు. ఆ 3 సంస్థలూ ప్రైస్‌బిడ్లను దాఖలు చేశాయి. వాటిని స్టడీ చేసిన ఇరిగేషన్‌శాఖ అధికారులు ఆఫ్రీకే అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించినట్టు సమాచారం. ఈ మేరకు తాజాగా ఆ సంస్థ సాంకేతిక అర్హతలు, ఫైనాన్షియల్ బిడ్ల వివరాలన్నీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అధికారులు వివరించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించారు. మంత్రి ఉత్తమ్ దీనిపై సంతృప్తి వ్యక్తంచేసినట్టు అధికారులు వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు తెలిపారు.