Uttam Kumar Reddy | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు స్పందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ జల హక్కులను కాపాడాలని కోరారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో శుక్రవారం రోజున మంత్రి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను చర్చించారు.
ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా గోదావరి బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నదని మంత్రి వివరించారు. ఇప్పటికే ఈ విషయమై ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలుపుతూ కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని వెల్లడించారు. కేంద్ర మంత్రి సైతం హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఏపీ దూకుడుగా ముందుకు పోతున్నదని, కేంద్రం సైతం సహకరిస్తున్నట్లుగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ బీజేపి నేతలు, కేంద్ర మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. అవార్డులకు, చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకు పోదని తాము ఇప్పటికీ విశ్వసిస్తున్నామని, అలాకాకుండా కేంద్రం వ్యతిరేఖంగా వ్యవహరిస్తే రాష్ట్ర జల హక్కుల రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. జీబీ లింక్ ప్రాజెక్టుపై తాము స్పందించడం లేదని ప్రచారాన్ని ఖండించారు. గతంలోనే కేంద్రానికి రాసిన లేఖలను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు.