నల్లగొండ ప్రతినిధి, ఆగష్టు 9 (నమస్తే తెలంగాణ): సుంకిశాలలో జరిగిన ఘటనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిజైన్ లోపమో లేక నిర్మాణ లోపం వల్లనో సైడ్‌వాల్ కూలిపోయిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోనే డిజైన్‌ను ఫైనలైజ్ చేసి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారని, రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా అప్పుడే జరిగిందని అందువల్ల ఆ ఘటనకు గత ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పురపాలక మంథ్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సుంకిశాల పర్యటనకు వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.
గడిచిన తొమ్మిది నెలల్లో సుంకిశాల పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసిందనే తాను భావిస్తున్నానని చెప్పారు. తాను పురపాలక శాఖ మంత్రిని కానందున ఈ పథకంపై అవగాహన లేదని స్పష్టంచేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఇంజినీర్లు, ఇతర అధికారులు ప్రాజెక్టు మంచి ఉద్దేశంతో చేపట్టారని స్పష్టం చేశారు. ‘ఆల్మట్టి, జూరాల గేట్లు ఎత్తారు, వరద వస్తుందని తెలుసు, అయినా టన్నెల్ ఎందుకు తెరిచారు అని మంత్రి తుమ్మల ప్రశ్నించగా.. తాము గేట్లు మూసే ఉంచామని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వరద తీవ్రతకు గేట్లు కొట్టుకుపోయాయని ఇంజినీర్లు చెప్పారు.
మీడియా: ఈ ఘటనను గోప్యంగా ఉంచారన్న ఆరోపణలకు ఏమంటారు?
ఉత్తమ్: గోప్యంగా ఉంచారని అనుకోను. ఇంజినీర్ల లెవల్లో వాళ్లు డీల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆరో తేదీనో తర్వాతనో వచ్చాక ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే చర్యలు తీసుకున్నం. రిటైనింగ్ వాల్ పడిపోవడంపై ఏజెన్సీ వాళ్లు పునఃనిర్మాణం చేస్తామని చెప్పారు.
మీడియా: తొందరగా పనులు చేయాలని మీరు అధికారుల మీద ఒత్తిడి తేవడం వల్లనే ఇలా జరిగిందన్న ఆరోపణలున్నాయి.?
ఉత్తమ్: ఇవన్నీ లేనిపోని మాటలు. ఎవ్వరూ ఎవ్వరి మీద ఒత్తిడి తేలేదు. నార్మల్ కోర్స్‌లోనే పనులు జరుగుతున్నాయి.
మీడియా: జరిగిన ఘటనపై విచారణ జరుగుతుందా?
ఉత్తమ్: తప్పనిసరిగా విచారణ జరుగుతుంది. వాటర్‌వర్క్స్ వాళ్ల లెవల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. సీఎంతో చర్చించి ప్రభుత్వం తరఫున కూడా ఒక ఉన్నతస్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తం.
మీడియా : కాంట్రాక్టు సంస్థది తప్పని తేలితే బ్లాక్‌లిస్టులో పెడతారా?
ఉత్తమ్: విచారణ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఆలోచిస్తది. ఎంక్వైరీ కానివ్వండి… అయ్యాక మాట్లాడుతాం.
మీడియా : గత ప్రభుత్వ వైఫల్యం అని భట్టి విక్రమార్క, ఇప్పుడు మీరు అంటున్నారు? జలమండలి వివరణలో ఏజెన్సీ సంస్థ అంచనాలో లోపమని తెలిపింది? ఇందులో ఏది కరెక్టు అని భావిస్తున్నారు?
ఉత్తమ్ : గత ప్రభుత్వంలో చేసిన ఏజెన్సీనే ఇది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లు చేసిన డిజైన్ లోపమో… లేదా నిర్మాణంలో లోపమో వల్లనో ఈ ఘటన జరిగింది. వాళ్ల(బీఆర్ఎస్)కు ఇంకొకర్ని విమర్శించే అర్హత లేదు. డిజైన్, కాంట్రాక్ట్, నిర్మాణం అంతా వాళ్ల టైంలోనే జరిగింది. కాబట్టి ఏది జరిగినా వాళ్లే బాధ్యత వహించాలి.
మీడియా: మీ ప్రభుత్వం వచ్చాక ఈ 9 నెలల్లో ఎప్పుడైనా సుంకిశాలపై సమీక్ష చేశారా?
ఉత్తమ్ : సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం సమీక్ష చేసి ఉంటుందనే అనుకుంటున్నా. నేను ఇరిగేషన్ మంత్రిని. నాకు దీనిపై అవగాహన లేదు.
ఈ పర్యటనలో రాష్ట్ర జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఏజెన్సీ డైరెక్టర్ సుదర్శన్, సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, ప్రాజెక్టు సీజీఎం కిరణ్‌కుమార్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ప్రాజెక్టు ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోకరమైనదని ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ చెప్పారు. వరుసగా నాలుగేండ్లు కరువొచ్చినా హైదరాబాద్‌కు ఇప్పంది లేకుండా నీళ్లు అందించవచ్చని అన్నారు. ‘ప్రస్తుతం ఉన్న స్కీమ్(పుట్టంగండి)తో సాగర్‌లో ఎండీడీఎల్ లెవల్లో ఎమర్జెన్సీ పంపింగ్ చేసేవాళ్లం. ఇలాంటి సమస్య రాకుండా ఈ పథకాన్ని 1994లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. దీని నిర్మాణం సంక్లిష్టంగా క్రిటికల్ స్రక్చర్తో ఉండటం వల్ల సాగునీటిని తాగునీటిగా ఇప్పటివరకు వాడుకుంటూ వస్తున్నం.
కానీ తాగునీటికే ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్టును 2022లో ప్రారంభించింది. దీని పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం తాగునీటి కోసమే ప్రత్యేకం. తీవ్ర వేసవిలోనూ ఎమర్జెన్సీ పంపింగ్‌తో పనిలేకుండా డెడ్‌స్టోరేజీ నుంచి కూడా నీళ్లు తీసుకోవచ్చు. నాలుగేండ్లు కరువు వచ్చినా ఇబ్బంది ఉండదు. సాగర్‌లో 450 ఫీట్ల వరకు డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం 510 అడుగుల వరకే డ్రా చేయడానికి వీలు ఉంది’ అని సుదర్శన్ వివరించారు.