Sita Rama Project | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ట్రయల్న్‌న్రు ఆదివారం నిర్వహిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టుకు చెందిన మూడు పంప్‌హౌజ్‌లను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
సచివాలయంలో శనివారం సీతారామ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 15న ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు.పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 67 టీఎంసీల గోదావరి జలాలను కేటాయించాలని కోరుతూ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, సుప్రీంకోర్టుతోపాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖాల అనుమతులపై దృష్టి సారించాలని సూచించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మలక్‌పేటలోని ప్రభుత్వ అంధబాలికల హాస్టల్లో బాలికపై లైంగికదాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్టు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. ఆ రోజు తనకు అధికారులిచ్చిన సమాచారాన్ని మాత్రమే ప్రస్తావించినట్టు తెలిపారు. తాను చెప్పిన మాటలను వక్రీకరించవద్దని హితవు పలికారు. ఇటువంటి సున్నితమైన అంశాల పట్ల బాధ్యతతో వ్యహరించాలని కోరారు. అంధబాలికపై లైంగిక దాడి కేసు పురోగతిని మంత్రి సీతక్క సచివాలయంలో శనివారం సమీక్షించారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు, దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. విధుల్లో అలసత్వం వహించిన సిబ్బందిని తొలగించామని చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ సెంటర్లను మంజూరు చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో అమలవుతన్న పథకాలను వివరించారు.