హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో సగం మంది కాం గ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చివరకు కొంతమంది మంత్రులు కూడా గైర్హాజరయ్యారు. దీంతో సర్కార్ వాదనలు, ప్రజెంటేషన్‌పై సొంత పార్టీ మం త్రులు, ఎమ్మెల్యేలకు కూడా నమ్మకం లేదేమోనన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి సభలో కూర్చున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు రాలేదు. మంత్రులు సైతం అదే దారిలో నడిచారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులు సభకు వచ్చినా లోపలికి బయటికి తిరుగుతూ కనిపించారు. ఉత్తమ్ ప్రజెంటేషన్‌ను ప్రారంభించిన కొద్దిసేపటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఆయన తన చాంబర్లోనే ఉండిపోయా రు. ఉత్తమ్ ప్రజెంటేషన్ పూర్తయ్యే వరకూ సభలోకి రాలేదు. వాస్తవానికి ఉత్తమ్ ప్రజెంటేషన్ ప్రారంభించిన సమయంలో సభలో చాలా తక్కువ మంది సభ్యులున్నారు. గమనించిన ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులు అప్రమత్తమయ్యారు. సభ్యులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బయట ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రప్పించారు. ఇలా చేయడం వల్లే ఆ మాత్రం సభ్యులు కనిపించారు. లేదంటే సభ ఖాళీగా ఉండేదనే చర్చ జరిగింది. సభలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఉత్తమ్ ప్రజెంటేషన్‌ను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. మధ్యాహ్నం భోజ నం తర్వాత ప్రజెంటేషన్ ఏర్పాటుచేయడంతో చా లామంది ఎమ్మెల్యేలు నిద్రలోకి జారుకున్నట్టు కనిపించారు. కొంతమంది బలవంతంగా నిద్రను ఆపుకొనే ప్రయత్నం చేశారు. ఉత్తమ్ మాత్రం ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు.
ఉదయం సెషన్‌కూ మూడో వంతు డుమ్మా
అసెంబ్లీ శీతాకాల సమావేశాల పట్ల అధికార పక్షం సభ్యులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. శనివారం ఉదయం సెషన్‌కు మూడోవంతు మంది ఎమ్మెల్యేలు, సగంమంది మంత్రులు గైర్హాజరు కావడమే ఇందుకు నిదర్శనం. స్పీకర్, అధికారపక్షం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఏడో విడత శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ శుక్రవారమే ప్రకటించింది. దీంతో ఆ పార్టీ సభ్యులు బాయ్‌కాట్ చేశారు. ఇక అధికారపక్షం కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు 15 మంది, నలుగురు మంత్రులు మాత్రమే ఉదయం సెషన్‌కు హాజరయ్యారు. వచ్చినవారు కూడా కొద్దిసేపే సభలో ఉండి తరువాత బయటకు వెళ్లిపోయారు. మంత్రులు సైతం అదేతీరున వ్యవహరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు వేసిన సభ్యులతోపాటు మరికొందరు మాత్రమే సభలో ఉన్నారు. వీరు కూడా సీరియస్‌గా ఉన్నట్టు కనిపించలేదు. సభలో అటూ ఇటూ తిరగడం, ముచ్చట్లు చెప్పుకోవడం కనిపించింది. సభ్యుల గైర్హాజర్‌తో సభలో సగానికిపైగా ఖాళీ కుర్చీలు దర్శనిమిచ్చాయి.
ఫోన్లు చేసి..పీపీటీకి పిలిపించి..
కృష్ణా, గోదావరి జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఉన్నప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు సమావేశానికి వచ్చేందు కు నిరాసక్తత కనబరిచారు. దీంతో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అధికారపక్ష సభ్యులకు ఫోన్లు చేసినట్టు తెలుస్తున్నది. దీంతో పలువురు ఆగమేఘాలపై సభకు వచ్చారు. మరికొందరు పెడచెవిన పెట్టారు. ప్రజెంటేషన్ సమయంలో కేవలం 39 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు మా త్రమే సభలో కనిపించారు. బీజేపీ, ఎంఐఎం సభ్యులు కూడా ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిచూపలేదు. సభలో పలువురు నిద్రలోకి జారుకోవడం చర్చనీయాంశంగా మారింది. సభ్యులు సభా మర్యాదలను పట్టించుకోకపోవడాన్ని ప్రజాస్వామికవాదులు తప్పుబడుతున్నారు. ప్రజాస్వామిక దే వాలయంలో సభ్యులు నిర్లిప్తత ప్రదర్శించడం సరికాదని ఆక్షేపిస్తున్నారు. సభా గౌరవానికి భంగం కలిగించారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.