హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఆ ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివధ ప్రాజెక్టుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులకు పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని, మోదీకుంట వాగు, చిన్నకాళేశ్వరం తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ అంశాలపై ఆర్ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో చర్చించాలని సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు.
సింగూరు ప్రాజెక్ట్‌పై నవంబర్ 27న ప్రత్యేక సమీక్షా సమావేశం ఉంటుందని తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారని, ఆ పర్యటన సందర్భంగా ఆ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యా దాస్ నాథ్, ఈఎన్సీ అనిల్ కుమార్, ఈఎన్సీ ఓఅండ్ఎం నాగేందర్రావు, చీఫ్ ఇంజినీర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.