హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన పత్తి రైతుల పాలిట శాపంగా మారుతున్నది. సీసీఐ పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడంతో పత్తి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న కొత్త నిబంధన సరికాదని రైతులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పత్తి రైతుల పాలిట శాపంగా మారాయని, పత్తి సేకరణకు ఇన్ని ఆంక్షలేమిటని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున పత్తి కొనుగోలు చేస్తుండగా, ఎకరాకు సగటున 11.74 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తున్నట్టు జిల్లా కలెక్టర్ల నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చింది.
ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, సీసీఐ కొత్త నిబంధన మరింత నష్టం చేసే విధంగా ఉన్నదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కపాస్కిసాన్ యాప్‌పై అవగాహన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గరవుతున్నట్టు రైతులు చెప్తున్నారు. రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 7 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేసి పాత పద్ధతిలో కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి రైతులు విన్నవించారు. ఇదే అంశంపై సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తాకు లేఖ రాశారు.