Tummala Nageswara Rao | అశ్వారావుపేట, అక్టోబర్ 13: అప్పు పుట్టకపోవడం వల్లే రైతు రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలో ఆయిల్‌పాం సాగుపై శనివారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రుణమాఫీ పూర్తికాకపోవడానికి రుణం లభించకపోవడమే కారణమని తెలిపారు. అయినప్పటికీ డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. గత డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ ఏడాది డిసెంబర్ 9 వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పైగా అప్పు తీర్చడం కోసం అప్పు పుట్టలేదని చెప్పడంతో రుణమాఫీ ఎగ్గొడుతారనే అనుమానాలు వ్యక్తంచేశారు.
రుణమాఫీ ఇక మాఫీయేనా..? అని రైతులు గుసగుసలలాడుకున్నారు. ఇదిలా ఉంటే, తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రెండో పంట కాలంలో రైతులకు ‘రైతు భరోసా’ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు కసరత్తు వేగవంతం చేస్తున్నారని వివరించారు.