Tummala Nageswara Rao | ఖమ్మం, అక్టోబర్ 20: ఖమ్మం పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు పచ్చి అబద్ధం ఆడారు. ఖమ్మం 16వ డివిజన్ శ్రీరాంనగర్లో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతుబంధును మొన్న మేం చెల్లించాం’ అంటూ అబద్ధాలు చెప్పారు. తమ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రుణమాఫీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు.గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదంటూ ఆరోపణలు గుప్పించారు. కర్షకుల కోసం నిర్విరామంగా రైతుబంధును అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తుమ్మల మరోసారి అబద్ధాలు వల్లించడంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. పదేండ్లపాటు నిరాటంకంగా పంటల పెట్టుబడి సాయాన్ని అందుకున్న రైతుల వద్ద తుమ్మల తన వ్యాఖ్యలతో అభాసుపాలయ్యాయి.