ఖమ్మం, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కూసుమంచి : మున్నేరు వరదల కారణంగా ఖమ్మం నగరంలో సుమారు 5 వేల ఇండ్లు, ఇతర ప్రాంతాల్లో మరో 2,500 కలిపి మొత్తం 7,500 ఇండ్లు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికలు వస్తాయని తెలిపారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఖమ్మంలోని కేఎంసీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి బాధితుల ఖాతాల్లో నగదు జమచేస్తామన్నారు. బురద తొలగింపు కోసం 100 ట్రాక్టర్లు, 50 జేసీబీలు, 70 ట్యాంకర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ పాల్గొన్నారు.
‘నాయకన్‌గూడెంలో తమను రక్షించాలని నాకు కూడా ఫోన్ చేశారు. చాలా ప్రయత్నం చేశాం.. చివరకు వరదలో కొట్టుకుపోయారనే సమాచారం చాలా బాధ కలిగించింది.. గుండెను పిండేసింది’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాయకన్‌గూడేనికి చెందిన యాకూబ్, సైదాబీ దంపతులు వరదల్లో చనిపోగా వారి కుటుంబసభ్యులకు కూసుమంచిలో ఆర్థికసాయం చెక్కును అందజేశారు. సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ వారిని బతికించాలని చాలా ప్రయత్నాలు చేశామని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, వ్యవసాయ, పంచాయతీరాజ్‌శాఖ సహకారంతో ఒకరి ప్రాణాన్ని కాపాడుకోగలిగామని చెప్పారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్డీవో గణేశ్, ఏసీపీ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.