నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే 31 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని(Loan waiver) చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) తెలిపారు. బుధవారం ఆయన నల్లగొండ(Nallagonda) జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని(Cotton buying centre) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..గడచిన 5 సంవత్సరాలలో రైతుకు ఏ బ్యాంకులో ఎంత బాకీ ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందని తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయం ప్రకారం 22 లక్షల తెల్ల కార్డులు కలిగిన రైతులకు ఇది వరకే 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ వారి ఖాతాలలో నగదు జమ చేశామన్నారు. ఈ నెలాఖరు నాటికి తెల్ల కార్డులు లేని 4 లక్షల మంది రైతులకు వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయల పైన రుణాలు ఉన్న రైతులకు కూడా రుణాలు మాఫీ చేసేందుకు షెడ్యూల్ ప్రకటిస్తామని, ఎట్టి పరిస్థితులలో ఈ పంట కాలంలోనే 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.