అనారోగ్యంతో మరణించిన ప్రముఖ సినీ గేయరచయిత కందికొండ యాదగిరి భౌతికకాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఫిలిం ఛాంబర్లో కందికొండ భౌతికకాయాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఇక్కడకు చేరుకున్న మంత్రి కందికొండ కటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కందికొండ పార్థివదేహంపై పులమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి.. కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటు అని చెప్పారు. తన పాటలతో తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్య పరిచారని కందికొండను గుర్తుచేసుకున్నారు. కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటు అన్నారు.
పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో యాదగిరి తనదైన ముద్రను సంపాదించుకున్నారని చెప్పిన ఆయన.. యాదగిరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.