హైదరాబాద్ : పశు వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani ) తెలిపారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో వీఏఎస్ (VAS) ల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు.
పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు, డివిజన్ లు, మండలాల ఏర్పాటు చేసినందు వల్ల అందుకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని సూచించారు. దీని ద్వారా జీవాలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని వివరించారు. పశుసంవర్ధక శాఖను పునర్వివ్యవస్తీకరణ చేపడితే అనేక పోస్టుల ఏర్పాటు జరుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పదోన్నతులు( Promotions) లేని తమకు పదోన్నతుల అవకాశం లభిస్తుందని చెప్పారు.
జీహెచ్ఎంసీ (GHMC) లో మాదిరిగా రాష్ట్రంలోని మున్సిపాలిటీ లలో వీధి కుక్కలు, కోతుల బెడద నివారణ, వాటికి అవసరమైన వైద్య సేవలు అందించడం, పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి మాట్లాడుతూ శాఖ లోని వైద్యులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టవలసిన చర్యలపై అధ్యయనం చేసి నివేదికను అందజేయాలని పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ని మంత్రి ఆదేశించారు.
నివేదికను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, వీఏఎస్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ ధర్మా నాయక్, తెలంగాణ వెటర్నరీ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, జనరల్ సెక్రెటరీ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.