యాదాద్రి భువనగిరి : తెలంగాణ అభివృద్ధిని ఏ శక్తి అడ్డుకోలేదు.. రాష్ర్టానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు. భువనగిరి మండలం వడాయిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణకు నష్టం జరిగితే పార్టీలకతీతంగా ఐక్యం కావాలన్నారు. ఎంతో మంది ప్రాణాల త్యాగఫలం తెలంగాణ అని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని కుల వృత్తుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, రైతు బంధు, రైతు బీమా, గీతా కార్మికులకు ఎక్స్ గ్రేసియా, ఇలా ఏదో ఒక పథకాన్ని లబ్దిపొందని కుటుంబం లేదన్నారు. గ్రామాలకు కరోనా కాలంలో కూడా నిధులను ప్రభుత్వం జమ చేసిందన్నారు. గ్రామాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో రూ. 9 కోట్లతో నీరా కేఫ్‌ను ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భువనగిరి మండలంలోని నందనవనంలో రూ. 6 కోట్లతో నీరా ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 7 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, అందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Unveiled the statue of Sri Sardar Sarvai Papanna Goud at Wadaigudem Village in Yadadri Bhuvanagiri District. pic.twitter.com/qai8MTeBZA
— V Srinivas Goud (@VSrinivasGoud) July 3, 2021