మహబూబ్‌నగర్, జూన్ 19: సాటి మనిషికి సాయం చేయాలన్న బసవేశ్వరుడి సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి వద్ద రూ.కోటి వ్యయంతో నిర్మించిన బసవ భవనాన్ని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న వారి కోసం బతకాలనేది బసవేశ్వరుడి సిద్ధాంతమన్నారు. వీరశైవ లింగాయత్ సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేసిందని తెలిపారు. అందుకే హైదరాబాద్‌లో ప్రభుత్వం ఎకరం స్థలంతోపాటు బసవ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్టు గుర్తుచేశారు. కులమతాలకతీతంగా ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదన్నారు.
పాలమూరులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అనంతరం మంత్రి మినీ ట్యాంక్‌బండ్ పనులను పరిశీలించారు. హన్వాడ మండలానికి చెందిన పలు పార్టీల నాయకులు హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పాటిల్, వీరశైవ లింగాయత్ గురువులు శివాచార్య స్వాములు, మణికంఠ శివాచార్య స్వాములు తదితరులు పాల్గొన్నారు.