
మహబూబ్నగర్ : మహబూబ్నగర్, హన్వాడ, కోస్గి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి తక్షణమే టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కోసం ఈ నెల 28న రూ. 704 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా, హైవే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం కేసీఆర్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భూత్పూర్ నుండి అమిస్తాన్పూర్, పాలమూరు యూనివర్సిటీ, వీరన్నపేట, చిందార్పల్లి, హన్వాడ, కోస్గి మీదుగా దుద్యాల గేట్ వరకు ప్యాకేజీ-1లో భాగంగా 60.25 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారిని నిర్మించుటకు సాంకేతిక, పరిపాలన అనుమతులు విడుదల చేయడం జరిగింది. ఈ రహదారి నిర్మాణ కోసం రూ. 704 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేయడం జరిగింది. అలాగే ప్యాకేజీ – 2 లో భాగంగా దుద్యాల గేట్ నుండి వయా కోడంగల్ , తాండూర్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ను కలుపుతూ కర్నాటక రాష్ట్రంలోని చించోళి హైవేకు కలుపుతూ పరిపాలన అనుమతులు రావాల్సి ఉంది. దీనికీ అంచనాలు కూడా సమర్పించడం జరిగింది. త్వరలో ప్యాకేజీ – 2 కు కూడా సాంకేతిక, పరిపాలన అనుమతులు మంజూరు అవుతాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అవుతే మహబూబ్ నగర్ పట్టణానికి మణిహారంగా నిలువబోతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ జాతీయ రహాదారి నిర్మాణం వల్ల దేశంలో ఏ నగరానికి లేని విధంగా హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా పాత మాస్టర్ ప్లాన్లో భాగంగా మహబుబ్ నగర్ పట్టణానికి రింగు రోడ్డు 75 శాతం పూర్తి అవుతుందన్నారు. హైదరాబాద్కు సమాంతరంగా మహబూబ్ నగర్ పట్టణంతో పాటు జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ రహాదారి నిర్మాణం ద్వారా కర్నాటక రాష్ట్రం నుండి మహబుబ్ నగర్ పట్టణం మీదుగా రాకపోకలు జరిగి పట్టణంతోపాటు జిల్లా అభివృద్ది జరుగుతుందని మంత్రి ఆకాంక్షించారు. జిల్లాలో పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో దోహదం చేస్తాయన్నారు. జిల్లాలో ప్రజల జీవనోపాధి మెరుగుపడేందుకు , వలసల నివారణతో పాటు జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగువుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.