రవీంద్రభారతి, ఏప్రిల్ 2: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ దేశం గర్వించదగ్గ గొప్ప పోరాటయోధుడు అని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పాపన్నగౌడ్ ఒక జాతికి చెందిన వ్యక్తికాదని, సబ్బండ వర్ణాల నాయకుడని కొనియాడారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం సర్వాయి పాపన్న వర్ధంతిని రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జర్నలిస్టు నేత పల్లె రవికుమార్, గౌడ సంఘం నేత పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, అంబాల నారాయణగౌడ్‌తో కలిసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలకోసం పాపన్నగౌడ్ పోరాడారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పాపన్న చరిత్రను బయటకు రాకుండా పాలకులు తొక్కేశారని ఆవేదన వ్యక్తంచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాపన్నగౌడ్ జయంతితోపాటు వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నగరంలో 15 రోజుల్లో నీరా సెంటర్లతోపాటు గౌడ భవనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. గౌడ కులస్థులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
వైన్‌షాపుల్లో గౌడ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా గౌడ కులస్థులకు సంక్షేమ పథకాలు, ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్టు వివరించారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అన్ని వర్గాల కోసం పోరాడిన యోధుడని వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తెలిపారు. పాపన్న ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ జిల్లాగా నామకరణం చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు.
అనంతరం పలువురు గౌడ్ సంఘం నేతలు, కల్లుగీత కార్మికులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఎం చంద్రశేఖర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి మల్లయ్యభట్టు, రంగారెడ్డి జిల్లా అధికారి ఉదయ్‌కుమార్, హైదరాబాద్ జిల్లా అధికారి ఆశన్న, దాసరి ఉదయ్‌కుమార్, గౌడ సంఘం నేతలు బాల్‌రాజ్‌గౌడ్, బత్తిని శ్రీలతగౌడ్, కే రాములుగౌడ్ తదితరులు ఉన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సభల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, గౌడ, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వారిలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, గౌడ సంఘాల ముఖ్య నేతలు అక్కె వీరస్వామి, లక్ష్మణరావు, బాలగోని బాలరాజ్, రాజేశం, రాజలింగం, ప్రభాకర్, రామారావు, వెంకన్న, విజయ్‌కుమార్, నారాయణ, వేములయ్య, మమత, నర్సాగౌడ్, ప్రతాని రామకృష్ణ, ఎంవీ రమణ, కీర్తిలత, గీత, అనురాధ తదతరులు ఉన్నారు.