Minister Srinivas Goud | తెలంగాణలో కొత్తగా రూపొందిస్తున్న క్రీడా, టూరిజం పాలసీలపై ఆయాశాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు అమలు చేస్తున్న రిజర్వేషన్ల పై చర్చించారు. సీఎం కప్ నిర్వహణ, అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిర్మిస్తున్న క్రీడా మైదానాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడాలేని విధంగా సుమారు 17వేల గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాల్లో స్పోర్ట్స్ కిట్స్‌ను అందించేందుకు కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఏర్పాటు ఏర్పాటు తర్వాత క్రీడలు, పర్యాటక రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులతో పాటు పర్యాటక ప్రదేశాల ప్రమోషన్ కార్యక్రమాలను, నూతన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాల్లో నూతనంగా నిర్మించతలపెట్టిన అమ్యూజ్మెంట్ పార్కులు, అడ్వెంచర్ టూరిజం, చిల్డ్రన్స్ పార్కుల అభివృద్ధి, మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్ షో, జెయింట్ వీల్, వేవ్ పూల్, వాటర్ రైడ్స్, వాటర్ గేల్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటుపై సమీక్ష సమావేశంలో చర్చించారు.
సమీక్ష సమావేశంలో ఆయాశాఖల ముఖ్య కార్యదర్శి శైలజ రామాయ్యర్, స్పోర్ట్స్ డైరెక్టర్ లక్ష్మి, టూరిజం డైరెక్టర్ నిఖిల, వైఏ టీఅండ్‌సీ జాయింట్ సెక్రెటరీ కరొల్ రమేశ్, టూరిజం ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, NITHM డైరెక్టర్ చిన్నం రెడ్డి, స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, దీపక్, చంద్రా రెడ్డి, ఓఎస్డీ హరికృష్ణ, హెరిటేజ్ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, టూరిజం అధికారులు మహేశ్, సత్యనారాయణ, అంజి రెడ్డి, శిల్పారామం GM అంజయ్య, టీఎస్‌టీడీసీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.