Minister Srinivas Goud | మహబూబ్నగర్ : యువత సమయం వృధా చేయకుండా తమదైన రంగంలో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదగాలి అని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 105 కంపెనీలతో పదివేలకు పైగా ఉద్యోగాలను కల్పించేందుకు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 18 వేల జాబ్ మేళాల ద్వారా 35 వేల మందికి ఉద్యోగాలను అందించామని తెలిపారు. మహబూబ్ నగర్లో ఇవాళ 10 వేల మందికి 105 కంపెనీల ద్వారా ఉద్యోగాలను అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికిప్పుడే ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ ఆఫర్ లెటర్ అందించామన్నారు. చిన్న ఉద్యోగాలని తక్కువ చేయవద్దు… తప్పనిసరిగా ఉద్యోగాల్లో చేరాలని కోరారు. ఆయా రంగాల్లో కష్టపడి అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చు అని యువతకు సూచించారు.
రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేనివిధంగా 400 ఎకరాల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల వేలాది ఉద్యోగాల కల్పనకు అవకాశం లభించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇటీవలే ఐటీ టవర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం 750 మంది స్థానికులకు అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు 10 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం. వచ్చే ఏడాది యువతకు శిక్షణ ఇప్పించి అమరాజా లిథియం అయాన్ గిగా పరిశ్రమలో మరో 10 వేల ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హన్వాడ ఫుడ్ పార్క్ ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగాలను అందించడమే కాకుండా వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జి రవి నాయక్, ఎస్పీ నరసింహ, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, అడిషనల్ కలెక్టర్లు మోహన్ రావు, యాదయ్య, డీవైఎస్వో శ్రీనివాసులు, జిల్లా అటవీ శాఖాధికారి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మున్సిపల్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్ కిషోర్, కో ఆప్షన్ సభ్యుడు రామలింగం, తదితరులు పాల్గొన్నారు.