Srinivas Goud | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఉద్యోగులపై సీఎం వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకమవుతున్నాయని చెప్పారు.
ఇందుకు సంబంధించి కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు శనివారం నాంపల్లిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ సంఘాల మాజీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా తెలంగాణ సమస్యలపై కలిసి ఉద్యమించిన ప్రజలను, ఉద్యోగులను విడదీసేలా సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పూరిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం ఆవేదన చెందుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు కోసం అన్ని సంఘాలను సమన్వయం చేసేందుకు, తా ము ఒక సమన్వయ కమిటీగా ఏర్పడాలన్న కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సుదీర్ఘకాలం పాటు క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమించి, అనేక పోరాటలు నడిపి, వివిధ ప్రభుత్వాల్లో తమ హక్కులను సాధించడంలో ముందు వరుసలో నిలబడి, ప్రయోజనాలను చేకూర్చిన రాష్ట్ర స్థాయి మాజీ నాయకులంతా సమావేశమైనట్టు వెల్లడించారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఉద్యోగుల సంఘం మాజీ చైర్మన్ జీ దేవీప్రసాద్‌రావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ఉద్యోగుల సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు సీ విఠల్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ఎస్టీయూటీఎస్ పూర్వ అధ్యక్షుడు బీ భుజంగరావు, టీఎన్జీవో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎం ఏ హమీద్, ఏ పద్మాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, టీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంజమూరి రఘునందన్,
రెవెన్యూ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మఠం శివశంకర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సుమిత్రానంద్ తానోబా, ఎస్టీయూ టీఎస్ మాజీ అధ్యక్షుడు ఏ లక్ష్మణ్, పాలిటెక్నిక్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు వై నర్సయ్యగౌడ్ , టీపీటీయూ మాజీ అధ్యక్షుడు వేణుగోపాలస్వామి, టీజీహెచ్ఎంఏ మాజీ అధ్యక్షుడు గుండం మోహన్‌రెడ్డి, ఎంపీడీవోల రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రావు, ఫారెస్టు ఉద్యోగుల ఫోరం కన్వీనర్ ఆదినారాయణరెడ్డి, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి విష్ణువర్ధన్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు హాసన్, ఎల్ శ్రీనివాస్‌రెడ్డి, కూరపాటి రంగరాజు, ఎం శ్యామ్‌రావు పాల్గొన్నారు.