మహబూబ్‌నగర్ అర్బన్/టౌన్, సెప్టెంబర్ 4 : రాష్ట్రంలోని అన్ని కులవృత్తులకు సీఎం కేసీఆర్ చేయూత నిస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరై 300 మంది లబ్ధిదారులకు బీసీబంధు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదట అత్యంత వెనుకబాటుకు గురైన పేద దళితుల ఆర్థికాభివృద్ధి కోసం దళితబంధు తీసుకొచ్చామని తెలిపారు. తర్వాత పేద, బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు బీసీబంధు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు ఏదో రూపంలో అందుతున్నాయని తెలిపారు. చేతివృత్తులు కనుమరుగైతే మానవ మనుగడే లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో మరుగున పడిన కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తూ వారిని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
దళిత, బీసీ బంధు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, విడుతల వారీగా అగ్రవర్ణ పేదలకూ వర్తింపజేస్తామని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డ్రైరన్ విజయవంతం కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. త్వరలో ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసి వచ్చే యాసంగి నాటికి మూడున్నర లక్షల ఎకరాల్లో పారించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్‌బండ్‌పై రూ.14 కోట్లతో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభోత్సవంపై హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమావేశం నిర్వహించారు.
ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్డు, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామం పాలమూరుకు ఐకాన్‌గా మారాయన్నారు. బ్రిడ్జిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బ్రిడ్జి మెన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గిరీష్ భరద్వాజ్ స్వయంగా డిజైన్ చేశారని తెలిపారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, టూరిజం ఎండీ మనోహర్, ఓఎస్డీ సత్యనారాయణ, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.