హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా త్వరలో గ్లోబల్ ఏఐ సదస్సును నిర్వహించాలని యోచిస్తున్నామని, ప్రపంచంలోని అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను ఈ సదస్సుకు ఆహ్వానించనున్నామని చెప్పారు.
మంగళవారం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ఐటీ రంగ ప్రముఖులు, ఐటీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలకు సంబంధించిన పెట్టుబడులు, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ), నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విధాన సంస్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టంను మెరుగుపర్చడం, సైబర్ సెక్యూరిటీ చర్యలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనీషియేటివ్స్, గ్లోబల్ సహకారాలు, గ్రీన్ టెక్నాలజీలపై ప్రచారం, బ్రాండ్ బిల్డింగ్-మార్కెటింగ్ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనున్నట్టు వివరించారు.
త్వరలో డిగ్రీ చివరి ఏడాదిని ఆర్అండ్డీ సంవత్సరంగా పరిగణించబడుతుందని, సాంకేతికరంగంలో వస్తున్న మార్పులు, నైపుణ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. గ్రాడ్యుయేట్లను ఉద్యోగార్ధులుగానే కాకుండా ఉద్యోగాల సృష్టికర్తలుగా తీర్చిదిద్దేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆవిష్కరణలను సులభతరం చేసేందుకు సంబంధిత ఎకోసిస్టంను మరింత బలోపేతం చేయాలని, ఇంక్యుబేటర్లను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఐటీ రంగ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు.
ఐటీ రంగ ప్రముఖులు రఘు బొడ్డుపల్లి (ఇన్ఫోసిస్), అరిజిత్ సర్కార్ (గూగుల్), మురళీ బుక్కపట్నం (టీఐఈ), బీవీఆర్ మోహన్‌రెడ్డి(సైయెంట్), రాజన్న వీ (టీసీఎస్), శ్రీధర్ ముప్పిడి (పర్పుల్ టాక్), ప్రశాంత్ నందూరి (హైసియా), ప్రభుత్వ సీఆర్వో అమర్నాధ్రెడ్డి ఆత్మకూరి తదితరులతోపాటు నాస్కామ్, ఎస్టీపీఐ, టీవీఏజీఏ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.