హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను అత్యుత్తమ నైపుణ్యాలున్న మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో స్కిల్లింగ్, రీసైక్లింగ్, అప్ స్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జేఎన్టీయూ గ్లోబల్ అల్యుమ్ని మీట్-2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జేఎన్టీయూలో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ క్లస్టర్లు, ఇంటర్నేషనల్ మెంటార్షిప్ నెట్ వర్క్‌లు, గ్లోబల్ అల్యూమ్ని కౌన్సెల్ ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి శ్రీధర్‌బాబు పూర్వ విద్యార్థులను కోరారు. ఒక ఉద్యోగిగా కాకుండా, పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ టీ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వరరావు, రెక్టార్ డాక్టర్ కే విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.