Minister Sridhar Babu | బడంగ్‌పేట, జూలై 20: ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు ‘కరెంటు బిల్లు’ షాక్ తగిలింది. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ అయ్యిందా? అని మహిళలను అడిగారు. ఎక్కడ సార్.. కాలేదు అని ఒక్కసారిగా ముక్తకంఠంతో మహిళలు సమాధానమిచ్చారు. దీంతో ఉలిక్కిపడ్డ మంత్రి.. అధికారులను వివరణ కోరుతూ.. జవాబుదారీతనం లేకపోవటంపై మండిపడ్డారు.
అధికారులకు మంత్రి చీవాట్లు అధికారుల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజిపైకి పిలిచి చీవాట్లు పెట్టారు. అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్, తహసీల్దార్ మాధవిరెడ్డి, ఏసీపీ కాశీరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రఘుకుమార్ పనితీరుపై మండిపడ్డారు. విద్యుత్తు అధికారులనూ వదల్లేదు.
మంత్రి సమావేశానికి విద్యుత్తు అంతరాయం లేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. దాదాపు 20 మంది కాపలా కాశారు. దీనిపై కొందరు పోలీసుల కన్నా తామే కాపలా కాయాల్సి వస్తుందని వాపోయారు.
మంత్రి: మీకు 200 యూనిట్ల కరెంటు బిల్లు మాఫీ అయ్యిందా?
మహిళలు: ఎక్కడైంది సారు? కాలేదు.
మంత్రి: ఎందుకు కాలేదు?
ళమహిలు: ఏమో సారు తెల్వదు.
మంత్రి: నీ పేరు ఏంటమ్మా?
మహిళ: పుష్ప సారు. నెల కిందట దరఖాస్తు ఇచ్చిన. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ సమాధానం చెప్తలేరు.
మంత్రి: కమిషనర్ ఎక్కడ? పుష్పకు ఎందుకు కరెంటుబిల్లు మాఫీ చేయటం లేదు?
కమిషనర్: ఏమో సర్
మంత్రి: ఆమె దరఖాస్తు ఎక్కడ ఉన్నది? ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి? వాటిని పరిశీలిస్తున్నారా?
కమిషనర్: దరఖాస్తులు పరిశీలిస్తాను సర్