హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని, ఏ పంట ఎంత వేయాలో ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి షిరిడీ ప్రాంతంలో ద్రాక్ష, జామ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశాన్ని పంట కాలనీలుగా విభజించి, పంటల సాగుపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎంత చేసినా తక్కువేనని, కేంద్రం మాత్రం అదనంగా చేయాల్సింది పోయి కోతలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో కేంద్రం వద్ద సరైన ప్రణాళిక లేకపోవటంతో రైతులకు ఇబ్బంలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో పంటల వైవిధ్యీకరణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో పర్యటించామని, తాజాగా మహారాష్ట్ర జాల్నా ప్రాంతంలో పంటలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మంత్రి వెంట తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.