హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కొస తెల్వదు, మొదలు తెల్వదు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులు తెల్వదు, రిజర్వాయర్లూ తెల్వవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కనీసం ప్రజ లు నవ్వుకొంటున్నారన్న ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్కు సాగునీరు తెచ్చే దమ్ముందా, దీనికి కాయితం రాసిస్తావా అని బండికి సవాల్ విసిరారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఆర్డీఎస్ కాలువను నిజాం ప్రభుత్వం ప్రతిపాదించిందని, 1946లో మొదలై 1956లో పనులు పూర్తయ్యాయని గుర్తుచేశారు.
తుంగభద్ర నదిపై రాయచూర్ జిల్లా మాన్వి వద్ద నిర్మించిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అని, దాని కింద మొత్తం 93,379 ఎకరాల ఆయకట్టు ఉన్నదని వివరించారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్కు 17.1 టీఎంసీల నీటిని కేటాయించిందని, ఆర్డీఎస్ ప్రధాన కాలువ పొడవు 142 కిలోమీటర్లని, మొదటి 42 కిలోమీటర్లు కర్ణాటకలో, మిగతా 100 కిలోమీట ర్లు తెలంగాణలో ఉంటుందని తెలిపారు. కాలువ ద్వారా అలంపూర్ నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించడం ప్రధాన ఉద్దేశమని, కానీ ఆర్డీఎస్ కాలువకు కర్ణాటక ఎన్నడూ సంపూర్ణంగా నీరిచ్చిన దాఖలాలు లేవని, అలంపూర్ తాలూకాలో 87,500 ఎకరాల ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీరందించాలని, కానీ ఇప్పటివరకు ఏనాడూ 20 వేల ఎకరాలకు కూడా నీళ్లు పారలేదని తెలిపారు.
కేసీఆర్ వల్లే చివరి ఆయకట్టుకు సాగునీరు
ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా కేసీఆర్ 2003లో జూలై 16 అలంపూర్ జోగుళాంబ ఆలయం వద్ద పాదయాత్ర మొదలుపెట్టి జూలై 25 వరకు నిర్వహించారని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. గద్వాలలో లక్ష మందితో బహిరంగసభ నిర్వహించి పాదయాత్ర విరమించారని గుర్తుచేశారు. 2003 ఆగస్టులో ఆర్డీఎస్ ఆయకట్టు రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై ఉమ్మడి రాష్ట్రంలోని ఎంపీలు అందరికీ కేసీఆర్ బహిరంగ లేఖ రాశారని, ఆ చర్యల ఫలితంగానే 2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసిందని చెప్పారు. ఆ కమిటీ తెలంగాణకు ఆర్డీఎస్ ద్వారా సాగునీరందడం లేదని నివేదిక ఇచ్చిందని, ఆ తర్వాత 2014 వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అనేకసా ర్లు టీఆర్ఎస్ ఆర్డీఎస్ ఆయకట్టు అంశంపై ఉద్యమించిందని వివరించారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్‌పై సంపూర్ణ సమీక్ష నిర్వహించారని చెప్పారు. అందుకు సంబంధించి 2017లో తెలంగాణ ప్రభుత్వం జీవో 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రూ.780 కోట్లతో చేపట్టిందని తెలిపారు. దీనిని కేవలం 10 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసిందని, తద్వారా 50 వేల ఎకరాలకు నీరందుతున్నదని వివరించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద మల్లమ్మకుంట, జూలకల్, వల్లూర్ రిజర్వాయర్లను ప్రతిపాదించారని, వీటికి సర్వే పూర్తయిందని వివరించారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
పాలమూరు ద్రోహులతో కలిసి పాదయాత్రా?
పుట్టిన నడిగడ్డను, తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు తీరని ద్రోహం చేసి, హంద్రీనీవాకు హారతిపట్టిన డీకే అరుణ వంటి ద్రోహులను పక్కనపెట్టుకొని ఆర్డీఎస్ ఆయకట్టు గురించి బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదమని నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు ద్రోహులతో కలిసి పాదయాత్ర చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వడ్లు కొంటాం.. వరి వేయాలంటూ రైతులను నమ్మబలికి తీరా పంట కోతకొచ్చాక బండి మొఖం చాటేశారని మండిపడ్డారు. ఇప్పుడు 60 ఏండ్ల కింద పూర్తయిన ఆర్డీఎస్ను 6 నెలల్లో పూర్తి చేస్తాననడం బండి అబద్ధాలకు నిదర్శనమని మండిపడ్డారు. పాలమూరు వాగులు, వంకలు తెలియని వాళ్లు పాలమూరు ప్రాజెక్టుల గురించి వంకలు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు.
నిజాం ప్రభుత్వం ప్రతిపాదించిన అప్పర్ కృష్ణా ప్రాజెక్టులో భాగమైన నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టులలో దాదాపు 50 టీఎంసీలు ఈ వేసవిలో కూడా నిలువ ఉన్నాయని, కానీ జూరాల, శ్రీశైలం ఎండిపోయాయని అన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎండాకాలంలో జూరాలను నింపే దమ్ము, ధైర్యం బండికి ఉందా అని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరమ్మంటే రాని బీజేపీ, ఇప్పుడు తెలంగాణకు తీరని విద్రోహాన్ని తలపెడుతున్నదని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.