హైదరాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): యాంత్రీకరణతో కూడిన ఆధునిక సాగుతోనే రైతులకు అధిక లాభాలు సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా రెండోరోజైన బుధవారం అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడంతోపాటు ఇల్లినాయిస్ రాష్ట్రం డికెటర్ నగరంలో నిర్వహించిన ఫార్మ్ ప్రోగ్రెస్ షోకు హాజరయ్యారు. ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ ఇక్కడి శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందజేయడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని వివరించారు. గత తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధించిందని, ఇప్పుడు సాంకేతిక వ్యవసాయ సాగుపై దృష్టి సారించాల్సి ఉన్నదని తెలిపారు.
ప్రతి గ్రామంలో యంత్ర పరికరాలను అద్దెకు ఇచ్చేలా ఊబరైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అమెరికాలో భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమైందని, తెలంగాణలో ఆ పరిస్థితులు లేవని తెలిపారు. చిన్న కమతాల వల్ల రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితమై యాంత్రీకరణ ఫలాలను అందుకోవాలని పిలుపునిచ్చారు. లాంగ్ వ్యూ ఫార్మ్‌లో సాగును పరిశీలించారు. అక్కడి సాగు వివరాలను సీఈవో స్టీవ్ హెన్రీ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు.