హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ‘తెగేదాక లాగొద్దు.. ఉద్యోగాలు ఊడుతయ్.. జీవో 16ను హైకోర్టు కొట్టివేసింది. న్యాయపరంగా సాధ్యం కాదు. కొత్త నోటిఫికేషన్ ఇస్తే.. కొత్త వారికే అవకాశాలు దక్కుతాయి.. అందుకని సమ్మె విరమించండి’ అంటూ 19 రోజులుగా సమ్మెలో ఉన్న గిరిజన ఆశ్రమ కాంట్రాక్టు టీచర్లకు (సీఆర్టీ) మహిశా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలతో మంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగానే సీఆర్టీల ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్‌ను పక్కనబెట్టి.. ఇతర అంశాలపై మంత్రి చర్చలు జరిపారు.
ఈ విషయంలో సీఆర్టీలను అణచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సీఆర్టీలకు ప్రతినెలా 5 లోపు జీతాలు విడుదల చేస్తామని, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తామని, మినిమం టైం స్కేల్ (ఎంటీసీ) ఇస్తామని మాత్రమే హామీ ఇచ్చారు. కానీ ఉద్యోగ భద్రత అంశంపై మాత్రం ప్రభుత్వం నోరు మెదపడం లేదని సీఆర్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇతర అంశాల కంటే ఉద్యోగ భద్రతే ప్రధాన డిమాండ్ అని గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజ్మీరా శివనాయక్ స్పష్టం చేశారు. చర్చల పేరుతో పిలిచిన మంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మంత్రి సీతక్క వద్ద జరిగిన చర్చల అనంతరం 19 రోజులుగా చేసిన సమ్మెను తాత్కాలికంగా విరమించామని గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు తెలిపారు. ఇది తాత్కాలికమే అని, మూడు నెలల్లో తమ డిమాండ్లు పరిష్కారం కాకుంటే మళ్లీ సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మినిమమ్ టైంస్కేల్ ద్వారా ప్రతినెలా రూ.49 కోట్లు, ఉద్యోగ భద్రతతో రూ.69 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. మధ్యలో ఉన్న తేడా కేవలం రూ.20 కోట్లు మాత్రమేనని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆ సంఘం నాయకులు కోరుతున్నారు.
రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్ ప్రకారం గిరిజనాభివృద్ధి కోసం తెచ్చిన ప్రత్యేక అధికారాల వల్ల సీఆర్టీలను క్రమబద్ధీకరించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ నాయకులు శివనాయక్ తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశ పూర్వకంగానే సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదని పేర్కొన్నారు. ఇదే కాంగ్రెస్ సర్కారులో సాంఘిక సంక్షేమ శాఖ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన దాదాపు 750 మంది టీచర్లను రెగ్యులర్ చేసిందని, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో కాంట్రాక్టు లెక్చరర్లను కూడా బీఆర్ఎస్ హయాంలో రెగ్యులర్ చేశారని తెలిపారు. వాటికి సాధ్యమైనప్పుడు.. సీఆర్టీలకు మాత్రం ఎందుకు సాధ్యం కాదని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.