హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లు ఆమోదానికి కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కోరారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌తో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో మంగళవారం భేటీ అయి వినతి పత్రం సమర్పించారు. ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. సాంకేతిక సమస్యలతో అది అమలుకు నోచుకోలేదు. జీహెచ్ఎంసీ చట్ట సవరణల బిల్లులోనే ములుగు మున్సిపాలిటీ అంశాన్ని చేర్చారు. జీహెచ్ఎంసీలో కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను 5 నుంచి 9కి, మైనార్టీ కోఆప్షన్ సభ్యుల సంఖ్య 2 నుంచి 5కు పెంచుతూ చట్టసవరణ చేశారు.
అదే బిల్లులో ములుగు మున్సిపాలిటీ అంశం ఉండటంతో బిల్లుకు అప్పటి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలపలేదు. ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి బిల్లు పంపారు. దీంతో అప్పటి నుంచి బిల్లు పెండింగ్‌లోనే ఉన్నది. ఆ బిల్లును ఆమోదించేలా చొరవ చూపాలని గవర్నర్‌కు మంత్రి సీతక విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లును రీకాల్ చేసి ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ కొత్త బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేలా కసరత్తు చేస్తున్నామని మంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలనాధికారిగా ఆదిలాబాద్‌లో పర్యటించాలని కోరగా గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు మంత్రి తెలిపారు. ములుగులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో గవర్నర్ ఉన్నారని, గ్రామాల జాబితా పంపామని వివరించారు.