హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో జాప్యం వద్దని మంత్రి సీతక్క సూచించారు. జాప్యాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుందని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆమె మాట్లాడుతూ ‘ఇండెంట్ ప్రకారం పాలు సరఫరా చేయగలరా? లేదా? ఒకవేళ చేయలేకపోతే ఇండెంట్‌ను తగ్గిం చి ఇతర సంస్థలకు ఆర్డర్ ఇవ్వాలా? అని విజయడైరీ అధికారులను ప్రశ్నించారు. పాల సరఫరాను గాడిలో పెట్టడానికి మూడు నెలల సమయం ఇస్తామని, ఆ తర్వాత కూడా సరిగ్గా పాలు సరఫరా కాకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలను మంత్రి సీతక్క స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థుల మరణాలపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
యాచారం, నవంబర్ 30 : గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలను పట్టించుకోని సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి నాయకులు శనివారం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. విద్యార్థుల ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనలపై నిర్లక్ష్యంగా ఉండటంతోపాటు శానిటేషన్ కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను చెల్లించలేని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కారుపై మానవ హక్కుల కమిషన్‌లో నాగోల్‌కు చెందిన విద్యార్థి నాయకుడు నాయిని శరత్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతో మెరుగ్గా ఉన్న గురుకులాలు ప్రస్తుత సర్కార్ హయాంలో అధ్వానంగా తయారైనట్టు చెప్పారు. ఏడాదికాలంలోనే 50 మంది విద్యార్థులు మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు. గతంలో గురుకుల సీట్ల కోసం పోటీపడిన విద్యార్థులు నేడు దవాఖానల్లో బెడ్ల కోసం పోటీ పడాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు.