Bala Bharosa | బాల భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. కలెక్టర్లతో సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి సీఎం ప్లాగ్ షిప్ కార్యక్రమమని.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యం కలెక్టర్లు పని చేయాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ 2047 సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్నారు. మహిళా సంఘాలచే సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు. వాటికి అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
అక్టోబర్ 2 న సోలర్ ప్లాంట్లు ప్రారంభించే లక్ష్యంతో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇప్పటికే జిల్లాల వారీగా సోలార్ ఇన్స్టాలేషన్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయన్నారు. వారితో సమన్వయం చేసుకుని సోలార్ ప్లాంట్ల పనులు ప్రారంభించాలని.. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులను నవంబర్ లోగా పూర్తి చేయాలని చెప్పారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పేద పిల్లలు వస్తారని.. కాబట్టి వాటి ప్రాముఖ్యతను గుర్తించి కలెక్టర్లు పనిచేయాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారాలను మహిళా సంఘాలతో కుట్టిస్తున్నామని.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 90శాతం యూనిఫారాలు కుట్టే పనులు పూర్తయ్యయాని తెలిపారు. పాఠశాల తెరిచే రోజు యూనిఫారాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అంగన్వాడీలు ఈ నెల 11న తెరుచుకుంటాయని.. అప్పటిలోగా కలెక్టర్లంతా వాటి నిర్వహణ ఎలా ఉందో పరిశీలించాలని సూచించారు. తొలిసారి అంగన్వాడీలకు సెలవులు ఇచ్చామని.. కాబట్టి భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పారు.
అంగన్వాడీల్లో చిన్నారులు చేరేలా చర్యలు చేపట్టాలని.. ప్రైవేట్ ప్లే స్కూల్స్‌కు ధీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలని సూచించారు. తాగునీరు, కరెంటు, టాయిలెట్ వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 11 నుంచి చేపట్టే అమ్మ మాట -అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్నారు. ఈ సంవత్సరం కొత్తగా వేయి అంగన్వాడీ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకు స్థలాలు సేకరించాలన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల్లో కొత్త సభ్యులను చేర్పించాలని ఆదేశించారు. ప్రతి మహిళా ఎస్‌హెచ్‌జీలో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగుల ధ్రువీకరణపత్రాల కోసం 38 ఆసుపత్రుల్లో పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా బాల భరోసా పథకం తీసుకువస్తున్నామని.. ఐదేళ్లలోపు చిన్నారులకు అన్నిరకాల పరీక్షలు చేయిస్తామని.. సమస్యలుంటే సర్జరీలు ఉచితంగా చేయించనున్నట్లు వివరించారు.