మహబూబాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్న ఎస్టీలను ముందు నుంచి కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తూ వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) పిలుపునిచ్చారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ మాలోత్ కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో ఉన్న గిరిజనులను 1956 లోనే ఎస్టీ జాబితాలో చేర్చారని, తెలంగాణలో ఉన్న గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి 20 ఏళ్లు సమయం వృథా చేసి చివరకు 1976లో ఎస్టీలు చేర్చారని విన్నవించారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్టీలను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఎస్టీలకు ఎంతో మేలు చేసిందని 500 జనాభా ఉన్న తండాలు, గూడాలను గ్రామపంచాయతీలు చేసిందని, ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారని, హైదరాబాద్ నడిబొడ్డున గిరిజన, ఆదివాసి భవనాలను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దకుతుందన్నారు.
అందుకు కృతజ్ఞతగా ఈనెల 11న హైదరాబాదులోని శామీర్‌పేటలో గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మారెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు బంధు సమితి మండల కమిటీ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, పరకాల శ్రీనివాస్ రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.