హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తమ సమగ్ర అభివృద్ధి కోసం నిత్యం పాటుపడే కేసీఆర్ వెంటే ఆదివాసీ గిరిజనులు ఉంటారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్మించిన ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలను ఈ నెల 17న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. దీనిని ఆదివాసీ గిరిజనులు తమ ఇంటి పండుగలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ఆమె ఎస్టీ ప్రజాప్రతినిధులతో ఆదివారం సమావేశమయ్యారు. ఆత్మగౌరవ భవనాల ప్రారంభోత్సవానికి నియోజకవర్గాల నుంచి గిరిజనులు భారీ ఎత్తున తమ తమ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబించే విధంగా హైదరాబాద్‌కు తరలివచ్చేందుకు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభోత్సవం అనంతరం లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభకోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశంలో ఎకడాలేని విధంగా ఆదివాసీ గిరిజనుల కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని చెప్పారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నారని గుర్తుచేశారు. దశాబ్దాలుగా పోడుభూముల విషయంలో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు మంత్రివర్గం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎస్టీ ప్రజాప్రతినిధుల బృందం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను పరిశీలించింది.కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు రేఖానాయక్ , రవీంద్రకుమార్, శంకర్‌నాయక్ , ఆత్రం సకు, బాపూరావు, హరిప్రియ, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, జీజీజీ చైర్మన్ వాల్యానాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు రూప్సింగ్, గుగులోత్ శ్రీరామ్‌నాయక్, పీఎసీఎస్ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.