హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయడంలో క్షేత్రస్థాయిలో పనిచేసేవారిదే కీలక పాత్ర అని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సోమవారం ఆమె రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్చార్డీ)లో నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, సీడీపీవోలకు ఇంటెన్సివ్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరచుకోవడానికి శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంసీహెచ్చార్డీ డైరెక్టర్ హరిప్రీత్సింగ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, జాయింట్ డైరెక్టర్ కేఆర్ఎస్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.