హైదరాబాద్ : నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ ను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ ప్రారంభించారు. ఈ ప్లాంట్ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ కోసం నాణ్యమైన ఫోర్టి ఫైడ్ బియ్యం ఉత్పత్తి చేయడము, పోషకాహార లోపం లేని తెలంగాణ కోసం కృషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమని తెలిపారు. దాదాపుగా 30 లక్షల మంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతి పెద్ద ప్లాంట్ ఇదే అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందు చూపుతో మన సంస్థ ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ 1975 లో నిర్మించింది కాబట్టి రానున్న భవిష్యత్ దృష్ట్యా నూతన ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 18,404 అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఫ్లాంట్ ద్వారా గంటకు 4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగనుందని తెలిపారు. దీని నిర్మాణం కోసం రూ. 42 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ఈ నూతన ప్లాంట్ ద్వారా తెలంగాణ, ఏపీతో పాటు ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు మనం పోషకాహారం అందించవచ్చన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రానున్న మరో 40 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అవసరం మేర పోషకాహారం ఉత్పత్తి జరుగుతుందన్నారు. సంస్థ ఉత్పత్తి చేసే బాలామృతం, బాలామృతం+, స్నాక్స్ వల్ల తెలంగాణలోని 33 జిల్లాల్లోని 35,699 అంగన్వాడీ సెంటర్ల ద్వారా దాదాపు 15.5 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని వివరించారు. అదే విధంగా ఏపీలోని 55,605 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 16.12 లక్షల మంది పోష్టికాహారం అందుకుంటున్నారని తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించాక ఉద్యోగులకు 20 శాతం వేయిజేస్ ఇవ్వడం జరిగిందని రాజీవ్ తెలిపారు. అలాగే సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సోలార్ పవర్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు మేడే రాజీవ్ సాగర్ వెల్లడించారు.