వరంగల్, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని మహిళ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మహిళలకు సర్కారు అండగా ఉంటూ, అన్ని దశల్లో వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని స్పష్టంచేశారు.
ఆరోగ్య మహిళ, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య మహిళ, కల్యాణలక్ష్మి, ప్రత్యేక గురుకులాలు.. ఇలా అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు. మహిళా సాధికారత, సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. ప్రతి మహిళ మరింత ధైర్యంగా, దృఢంగా ఉన్నప్పుడు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని తెలిపారు. మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన దురదృష్టకరమని, నిత్య జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకుసాగాలని సూచించారు.
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్తో కలిసి మంత్రి సత్యవతి బుధవారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా 27 మంది మహిళలకు పురస్కారాలు అందజేశారు.
మహిళల భద్రత కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలు దేశానికి తలమానికంగా నిలిచాయని అన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. కేసీఆర్ కిట్ రాకముందు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం కాన్పులు అయ్యేవని, ఇప్పుడు 61 శాతం జరుగుతున్నాయని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.750 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ మొత్తాన్ని మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు.
కేయూలో 2 హాస్టళ్ల నిర్మాణానికి 20 కోట్లు
గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలను నిర్మించేందుకు రూ.20 కోట్లను మంజూరు చేస్తున్నట్టు మంత్రి సత్యవతి ప్రకటించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 27 మంది మహిళలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ వేదికపై కాకతీయ తోరణం కలిగిన షీల్డులు, పోచంపల్లి శాలువాలతో సత్కరించారు. ప్రశంస పత్రాలతోపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కు అందించారు. తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంసృతిక, జానపద కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా వర్సిటీలోని వనితావనంలో అవార్డు గ్రహీతలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కేయూ వీసీ టీ రమేశ్, హనుమకొండ జడ్పీ చైర్మన్ ఎం సుధీర్‌బాబు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జీడబ్లూఎంసీ డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీమ్, కుడా చైర్మన్ సుందర్‌రాజుయాదవ్, కార్పొరేటర్ కవిత, మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హొలికేరి, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, డీసీపీలు పుష్ప, అనూరాధ పాల్గొన్నారు.
మహిళా ప్రజాప్రతినిధులకు సత్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో పలువురు మహిళా ప్రజాప్రతినిధులను, అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సత్కరించారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, అరుణోదయ సాంసృతిక సమాఖ్య వ్యవస్థాపకురాలు విమలకను మంత్రి శాలువాలతో సతరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.