Minister Satyavathi Rathod | న్యూఢిల్లీ : ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై బండి సంజయ్( Bandi Sanjay ) చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా సమాజం తీవ్రంగా ఖండిస్తుంది అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై( Governor Tamilisai ) ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ స్పందించాలన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు తావు లేదని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయ విలువల్లేని వ్యక్తి అని విమర్శించారు. మహిళలను ఏ మాత్రం గౌరవించకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమన్నారు. మహిళలు తల దించుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగతమా..? పార్టీ లైనా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐ దాడులకు తెలంగాణ బిడ్డలు భయపడరు అని సత్యవతి రాథోడ్ తేల్చిచెప్పారు.