హైదరాబాద్ : దేశంలో ఎస్సీ, ఎస్టీలు వెనుకబడటానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. కాంగ్రెస్ నేతలు తప్పుడు డిక్లరేషన్ ప్రకటించారు. వారి డిక్లరేషన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ డిక్లరేషన్ పేరుతో ఆ పార్టీ సభ పెట్టడం హాస్యాస్పదం అన్నారు. దేశం మొత్తం ఇదే డిక్లరేషన్ను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించే దమ్ముంద అని సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. మా గూడెంలో మా రాజ్యం కలను కేసీఆర్ సాకారం చేశారు. 3,146 గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. ఒక్క సంవత్సరంలోనే 4 లక్షల మందికి పోడు పట్టాలు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. హైదరాబాద్లో కుమ్రంభీం, సేవాలాల్ భవనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది.
అంతేకాదు సేవాలాల్ జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్కు సేవాలాల్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్లో 10 మంది నేతలు కలిసి ఉండే పరిస్థితి లేదన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే కాంగ్రెస్ పార్టీ దుర్భుద్ధి. కాంగ్రెస్ కపట మాటలను దళిత, గిరిజన బిడ్డలు నమ్మొద్దన్నారు. చైతన్యవంతమైన దళిత, గిరిజన బిడ్డలు కాంగ్రెస్ కుట్రలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.