Teachers Day | ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. భవిష్యత్తును ఇచ్చేది గురువేనని పేర్కొన్నారు. పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర భాధ్యతను నిర్వహిస్తున్నారని మంత్రి కొనియాడారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని, తద్వారా బంగారు తెలంగాణ సాధించవచ్చనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ తెలంగాణలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక గురుకులాలు పెట్టి, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
కాగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం ( సెప్టెంబర్ 5వ తేదీన ) తెలంగాణ ప్రభుత్వం గురుపూజోత్సవం నిర్వహించనుంది. రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 125 మంది టీచర్లు, అధ్యాపకులు, ఆచార్యులను ఘనంగా సత్కరించనున్నారు.