హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, వ్యవసాయ కోర్సు ల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఎంసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో అబ్యాయిలు ర్యాంకుల పంట పండించగా.. ఓవరాల్ ఉత్తీర్ణతలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇంజినీరింగ్ టాప్ -10 ర్యాంకుల్లో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉండగా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ టాప్ -10 ర్యాంకుల్లో 9 మంది అబ్బాయిలు నిలిచారు. ఒకే ఒక్క అమ్మాయి టాప్ -10లో చోటు దక్కించుకోవడం గమనార్హం.
నిరుటితో పోల్చితే తగ్గిన ఉత్తీర్ణతశాతం
నిరుడితో పోల్చితే ఎంసెట్‌లో ఉత్తీర్ణతశాతం స్వల్పంగా తగ్గింది. 2022 ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌లో 80.41శాతం విద్యార్థులు క్వాలిఫై కాగా, ఈ ఏడాది 80.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో నిరుడు 88.40 శాతం విద్యార్థులు క్వాలిఫై అయితే.. ఈ ఏడాది 86.31 శాతానికి పడిపోయింది. కొన్ని సెషన్లల్లో ప్రశ్నపత్నాలు సులభంగా వచ్చినా.. విద్యార్థులు గందరగోళానికి గురై తప్పులు చేయడం, జవాబుల ఆప్షన్లు దగ్గరగా ఉండటంతోనే ఇలా జరిగిందని జేఎన్టీయూ ప్రొఫెసర్లు విశ్లేషించారు.
ఫలితాల్లో 155.008732 మార్కులతో బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్టేట్ టాపర్‌గా, ఇంజినీరింగ్‌లో 158.898780 స్కోర్‌తో సనపల అనిరుధ్ స్టేట్ టాపర్‌గా సత్తాచాటాడు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో నశిక వెంకట తేజ, సఫల్ లక్ష్మీ పసుపులేటి, దుర్గంపూడి కార్తికేయరెడ్డి, బోరా వరుణ్‌చక్రవర్తి వరుసగా టాప్ -5 ర్యాం కర్లుగా నిలిచారు. ఇంజినీరింగ్‌లో వై వెంకట మణిందర్‌రెడ్డి, చల్లా ఉమావరుణ్, అభినీత్ మాజేటి, పీ ప్రమోద్‌కుమార్‌రెడ్డి టాప్ -5లో ఉన్నారు. మొత్తం గా ఇంజినీరింగ్‌లో 80.33 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 86.31శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మూడు రోజుల్లోనే ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడులకానున్నది.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది ఎంసెట్‌ను సకాలంలో నిర్వహించామని పేర్కొన్నారు. నిర్ణీత సమాయానికే ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఎంసెట్‌లో ఉత్త మ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎంసెట్ పరీక్షల నిర్వహణకు కృషిచేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, జేఎన్ఏఎఫ్ఏ యూ వీసీ ప్రొఫెసర్ కవితా దర్యానిరావు, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్‌లో మూడు మార్కులు అదనం
ఎంసెట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మూడు మార్కు లు అదనంగా కలిపారు. గణితంలో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడం, ప్రశ్నల్లో స్పష్టత లోపించడంతో ఆయా ప్రశ్నలకు మూడు మార్కులు కలిపారు. అయితే మొత్తంగా 6 సెషన్లకు పరీక్షలను నిర్వహించగా, 5, 6 సెషన్లల్లోనే ఈ తప్పులు చోటుచేసుకొన్నాయి. విద్యార్థులు నష్టపోవద్దనే ఉద్దేశంతో సబ్జెక్ట్ నిపుణుల సూచనల మేరకు మూడు మార్కులు కలిపి, ఫలితాలను ప్రకటించారు. నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా సైతం కొన్ని సెషన్స్‌లో కఠినంగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలిసినట్టు తెలిసింది.
01
గురుకుల విద్యార్థుల సత్తా
ఎంసెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) విద్యార్థులు సత్తా చాటా రు. ఎస్సీ సీవోఈల నుంచి ఎంపీసీలో 1,354 మంది, బైపీసీలో 1,304 మొత్తంగా 2,658 మంది పరీక్షకు హాజరయ్యారు. 2,646 మంది (99.66 శాతం) అర్హత సాధించారు. ఎస్టీ సీవోఈల నుంచి 521 మంది ఎంపీసీ, 409 మంది బైపీసీ మొత్తంగా 930 మంది పరీక్షకు హాజరుకాగా, 100 శాతం మంది అర్హత సాధించారు. ఎస్సీ సీవోఈల్లో ఇంజినీరింగ్‌లో 30 మంది, ఎస్టీ సీవోఈల్లో 13 మంది 10 వేలలోపు ర్యాంకులు సాధించారు. బైపీసీ విద్యార్థులు అగ్రికల్చర్ విభాగంలో ఎస్సీ గురుకులాల నుంచి 55 మంది, ఎస్టీ నుంచి ముగ్గురు విద్యార్థులు 5వేల లోపు ర్యాంకులు పొందారు. గౌలిదొడ్డి ఎస్సీ గురుకుల సీవోఈకి చెందిన సాదమ్ రామకృష్ణ 237, బోయ అనుదీప్ 1,579, మాంజ రంజిత్ 2,146, నాగరాజు 3,501, స్వాతి వీరపాడ 3,875, ఎండ్రకంటి నవ్యశ్రీ 5,780, చిల్కూర్ ఎస్సీ సీవోఈ విద్యార్థి రాముడు 3,158 ర్యాంకులను (ఇంజినీరింగ్) సాధించారు.
బైపీసీలో గుగులోత్ సంధ్య, 207, పెంబర్ల ఝాన్సీ 384, బన్నేల కీర్తన 685, ముదావత్ నవ్యశ్రీ 775, సబ్బని సన్నిహిత 847, చేతన్ కుమార్ అంబాల 1,051 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌లో ఎస్టీ సీవోఈలకు చెందిన భూక్య గణేష్ 3,123, ఐశ్వర్య 4,435, గుగులోత్ నంది 4,761, బైపీసీ విభాగంలో గుగులోత్ భీమ్‌సాగర్ 1,509, నాగలక్ష్మి 2,526, కా వ్యాంజలి 3,350, నవ్యతేజ 5,506 ర్యాంకులు సాధించారు. బీసీ గురుకులాల నుంచి మొత్తంగా 2,601 మంది విద్యార్థులు ఎంసెట్‌లో అర్హత సాధించారు. 26 మంది విద్యార్థులు పదివేల లోపు ర్యాంకులతో సత్తా చాటారు. ర్యాంకర్లను మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, గురుకుల కార్యదర్శి మల్లయ్యభట్టు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ అభినందనలు తెలిపారు.
కార్డియాలజిస్ట్ నవుతా
ఎంసెట్ కోసం రోజుకు 10 -16 గంటలు చదివేవాడిని. నీట్ రాశా మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకముంది. మొత్తంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. సామాన్య కుటుంబం నుం చి వచ్చి డాక్టర్ అయిన మా బంధువే నాకు స్ఫూర్తి. నాన్న సాయి రామకృష్ణ వ్యవసాయం చేస్తారు. రెండెకరాలతోపాటు కొంత కౌలుకు తీసుకొని పంటలు పడిస్తారు. ఆయనలాగే నేను కష్టపడడం నేర్చుకొన్నా. కార్డియాలజిస్ట్ కావాలనేది నా కల. పేద ప్రజలకు సేవచేస్తా.
-బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్,
ఫస్ట్ ర్యాంకు (మెడికల్) కంపెనీకి సీఈవో నా లక్ష్యం
మాది శ్రీకాకుళం జిల్లా దివిలాడ. నాన్న ఖగేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్. నాన్న ఎంతో కష్టపడి చదివి ఎస్ఐ అయ్యారు. ఆ కష్టాన్ని.. ఉద్యోగం సాధిస్తే వచ్చే సంతృప్తిని నాకెప్పు డూ చెప్తూ ఉంటారు. మా అమ్మ నా మోటివేటర్. ఐఐటీ బాంబేలో చదవాలన్నది నా కోరిక. పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధిస్తాను. ఆ కంపెనీకి సీఈవో కావాలనేది నా కల.
-సనపాల అనిరుధ్, ఫస్ట్ ర్యాంకు (ఇంజినీరింగ్)
నాన్నలాగే సాఫ్ట్‌వేర్‌వైపు
ఎంసెట్‌లో ర్యాంకు కోసం రోజుకు 8 నుంచి 10 గంటలపాటు కష్టపడి చదివా. టాప్ 3లో ఉంటాననుకున్నా..కానీ నాలుగో ర్యాంకు వచ్చింది. కాలేజీలోనే కాదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్టడీపై శ్రద్ధ పెట్టేవాడిని. జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా 18వ ర్యాంకు వచ్చింది. నాన్న శశిధర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆయనలాగే నేనూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌నవుతా.
– అభినీత్ మాజేటి, 4వ ర్యాంకు (ఇంజినీరింగ్)
కలెక్టర్ నా లక్ష్యం
మాది నల్లగొండ జిల్లా వేములపల్లి. నాన్న మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎంసెట్‌లో 7వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేయాలన్నది నా కోరిక. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అవుతా. ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం. కలెక్టర్ అయి ప్రజలకు సేవచేస్తా.
– వడ్డే శాన్వితరెడ్డి, ఏడో ర్యాంకు (ఇంజినీరింగ్)
విదేశాల్లో ఎంఎస్ చదువుతా
ఎంసెట్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోలేదు. నీట్‌కు మా త్రమే సన్నద్ధమయ్యా. ఆ ప్రిపరేషనే ఎంసెట్‌కు పనికొచ్చింది. ఎయిమ్స్ ఢిల్లీలో సీటు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో ఎంబీబీఎస్ చేసి విదేశాల్లో ఎంఎస్, ఎండీ కోర్సులు చదవాలని అనుకుంటున్నా.
– సఫల్ లక్ష్మి, మూడో ర్యాంకు (మెడికల్)